సుమన్ అరెస్ట్ ను నిరసిస్తూ బిఆర్ఎస్ నాయకుల బైఠాయింపు

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అధికారం చేతిలో ఉందనే కారణంతో తెలంగాణ ఉద్యమకారుడైన బాల్క సుమన్‌పై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు.

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

జాతీయ రహదారిపై నిర్వహించిన ఆందోళనతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసి, నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు.

Leave a Reply