‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’లో ఉయ్యూరు మున్సిపాలిటీకి ప్రథమ స్థానం

ఉయ్యురు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో 50 వేలలోపు జనాభా గల మున్సిపాలిటీల విభాగంలో వుయ్యూరు మున్సిపాలిటీ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. గుడివాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ఎం.సుబాష్ చంద్రబోస్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఎం.సుబాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ఈ అవార్డు వుయ్యూరు మున్సిపాలిటీ సిబ్బంది సమష్టి కృషికి, ప్రజాప్రతినిధుల సహకారానికి, పట్టణ ప్రజల భాగస్వామ్యానికి లభించిన గుర్తింపుగా అభివర్ణించారు.

ఈ విజయానికి సహకరించిన ముఖ్యమంత్రికి, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులు, శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్యదర్శులు, వార్డు సచివాలయ సిబ్బంది, ఇంజినీరింగ్ విభాగం, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, స్వచ్ఛ కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు మరియు పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు.

పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుందరమైన ఉయ్యూరును నిర్మించేందుకు ప్రజల సహకారంతో ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా పనిచేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ పురస్కారాన్ని ఉయ్యూరు పట్టణ ప్రజలందరికీ అంకితం చేస్తున్నామని కమిషనర్ ఎం.సుబాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.