Krishna Waters | తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీరూ వదులుకోం

Krishna Waters | తెలంగాణ వాటాలో ఒక్క చుక్క నీరూ వదులుకోం

Krishna Waters | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పాలమూరు ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృష్ణా, గోదావరి జలాల పంపకాల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పనులను పరిశీలించిన అనంతరం మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నీటి వివాదాల పరిష్కారానికి చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమస్యలు త్వరలోనే కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉందని వెల్లడించారు.

పొరుగు రాష్ట్రంతో చర్చలు జరుపుతున్నప్పటికీ తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. వివాదాలను మరింత పెంచడం కంటే చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

పాలమూరు, డిండి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, ఎన్‌వోసీలు వచ్చిన తర్వాతే మిగతా ప్రాజెక్టులపై చర్చలు ముందుకు సాగుతాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరును సస్యశ్యామలం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేసే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నానని హామీ ఇచ్చారు.

Leave a Reply