Celebrations | మహా శాస్త్రవేత్త విగ్రహ ఆవిష్కరణ…

Celebrations | మహా శాస్త్రవేత్త విగ్రహ ఆవిష్కరణ…
- ఉత్తమ పరిశోధనలకు పురస్కారాలు
Celebrations | విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రపంచ వైద్య విజ్ఞానానికి ఎనలేని సేవలందించిన మహా శాస్త్రవేత్త డా. యెల్లాప్రగడ సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని, విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఈ రోజు పరిశోధనా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డా. యెల్లాప్రగడ సుబ్బారావు విగ్రహాన్ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.
ఆధునిక వైద్య శాస్త్రానికి పునాదులు వేసిన డా. సుబ్బారావు సేవలను స్మరించుకుంటూ అందరు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముప్పై ఆరు వైద్య కళాశాలలు, అనుబంధ దంత వైద్య కళాశాలల ప్రిన్సిపల్ లు హాజరయ్యారు. డా. యెల్లాప్రగడ సుబ్బారావు ఆధునిక జీవరసాయన శాస్త్రానికి పితామహుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
కణాలలో శక్తి మూలాన్ని గుర్తించడం, క్యాన్సర్ చికిత్సలో వినియోగించే ఔషధాల అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడం, సూక్ష్మజీవ నిరోధక మందుల పరిశోధనకు బాటలు వేయడం వంటి ఆయన కృషి కోట్లాది మందికి ప్రాణరక్షణగా నిలిచింది. పరిశోధనా దినోత్సవంలో భాగంగా అధ్యాపకులు, స్నాతకోత్తర విద్యార్థులు, శిక్షణార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్వహించిన ఉత్తమ పరిశోధనలకు పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా డా. యెల్లాప్రగడ సుబ్బారావు పురస్కారాన్ని ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణుడు డా. లోకేశ్వరరావు సజ్జాకు ప్రదానం చేశారు. అనంతరం ఆయన వైద్య పరిశోధన, గతం, వర్తమానం, భవిష్యత్ అంశంపై విశేష ఉపన్యాసం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు డా. కె. మధు మూర్తి, వైద్య విద్యా సంచాలకులు డా. జి. రఘునందన్, ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడు న్యాయమూర్తి యు.డి. దుర్గ ప్రసాద్ రావు (రిటైర్డ్) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
