Temple | దుర్గగుడిలో అపచారాలకు ప్రాయశ్చిత్తంగా పూజలు

Temple | దుర్గగుడిలో అపచారాలకు ప్రాయశ్చిత్తంగా పూజలు

  • కామధేనువు అమ్మవారి వద్ద వైఎస్సార్‌సీపీ నేతల పూజలు

Temple | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న వరుస అపచారాలకు ప్రాయశ్చిత్తంగా విజయవాడలోని కామధేనువు అమ్మవారి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టుచీర, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలను మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమ్మవారి గుడి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోందని ఆరోపించారు. భవానీ దీక్షల ఇరుముడులు చైర్మన్‌, ఈవో మోస్తున్నారని, ఇది పాలకమండలి అపచారమని విమర్శించారు. మూడు గంటలపాటు దేవాలయాన్ని చీకట్లో ఉంచడం దారుణమన్నారు. దేవాదాయ, విద్యుత్ శాఖలు ముఖ్యమంత్రి పరిధిలోనే ఉన్నా ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. అభిషేకానికి వాడే పాలల్లో పురుగులు రావడం, గుడిపై కేక్ కట్ చేయడం హేయమని అన్నారు.

లడ్డు కౌంటర్ వద్ద కరెంట్ షాక్ ఘటన, వరుస అపచారాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని చెప్పారు. భక్తులకు కృష్ణానదిలో స్నాన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లోనూ అపచారాలు, భద్రతా లోపాలు పెరిగాయని, దేవస్థాన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఎన్నో ఘటనలు జరిగినా మౌనం వహించామని, ఇప్పుడు పరిస్థితి హద్దులు దాటిందన్నారు. గోశాల తరలింపు, ప్యాకెట్ పాలతో అభిషేకాలు, సక్రమంగా జరగని అన్నదానం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. చిన్న అర్చకులకు నోటీసులు ఇచ్చి వేధింపులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేస్తూ, హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ రాసిన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply