ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉత్తమ పురస్కారం అందజేత

ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి ఉత్తమ పురస్కారం అందజేత
దండేపల్లి, ఆంధ్రప్రభ: ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జశ్విత్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. పదవ తరగతిలో 560 మార్కులకు పైగా సాధించి దండేపల్లి మండల టాపర్‌గా నిలిచిన ఈ విద్యార్థిని, అతనికి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్స్ రాజేశ్వర్ రావును ఐ ఫౌండేషన్ సంస్థ ప్రత్యేకంగా గౌరవించింది.
మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) ప్రొఫెసర్ కోదండరాం, భువనగిరి లోక్‌సభ సభ్యులు (ఎంపీ) చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థి జశ్విత్, ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్ రావులకు ప్రతిష్టాత్మక ‘రవీంద్రభారతి ఉత్తమ పురస్కారం’ అందజేశారు. ఘనంగా సన్మానించి జ్ఞాపికలతో పాటు ప్రశంసా పత్రాలను బహూకరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ సరైన వసతులు, ప్రణాళికతో కష్టపడితే అద్భుతాలు సాధించవచ్చని ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రముఖులు కొనియాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ఈ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల కీర్తిని రాష్ట్ర రాజధానిలో చాటిచెప్పిన విద్యార్థి జశ్విత్‌ను పలువురు విద్యాశాఖ అధికారులు అభినందించారు.
