సీసీటీవీ కెమెరాలతో గ్రామ భద్రత
సీసీటీవీ కెమెరాలతో గ్రామ భద్రత
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: “మన ఊరు–మన భద్రత, మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రయోజనాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్‌ఐ సీహెచ్. సతీష్ ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఎం. వెంకట్‌కుమార్ గ్రామస్థులకు సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు.
సీసీటీవీ వ్యవస్థలు గ్రామ భద్రతను పెంపొందించడంలో, నేరాల నివారణలో, అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 24 గంటల పర్యవేక్షణ ద్వారా సంఘవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో సీసీటీవీ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. గ్రామ భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు.
