మెరకనపల్లి స్మశానవాటికకు సీసీ రోడ్డు మంజూరు

మెరకనపల్లి స్మశానవాటికకు సీసీ రోడ్డు మంజూరు

విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించిన కలెక్టర్ డీకే బాలాజీ

గ్రామాభివృద్ధికి సహకరించిన కలెక్టర్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

మోపిదేవి, ఆంధ్రప్రభ: మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామంలో దాతల సహకారంతో అభివృద్ధి చేస్తున్న హిందూ స్మశానవాటికకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం చేసిన విజ్ఞప్తికి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినట్లు గ్రామ పీఏసీఎస్ చైర్మన్, మండల రెడ్‌క్రాస్ చైర్మన్ యర్రంశెట్టి సుబ్బారావు తెలిపారు.

మచిలీపట్నంలో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సమావేశంలో పాల్గొన్న సుబ్బారావు, మెరకనపల్లి గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన హిందూ స్మశానవాటిక వివరాలను కలెక్టర్‌కు వివరించారు. స్మశానవాటికకు చేరుకునే మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణం అవసరమని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఈ విజ్ఞప్తిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్మశానవాటిక అభివృద్ధి పనులను ఫొటోలు, వీడియోల ద్వారా పరిశీలించారు. గ్రామ ప్రజలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్మశానవాటికను అభివృద్ధి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాతలను ప్రత్యేకంగా అభినందించారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సిఫార్సు మేరకు స్మశానవాటికకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధికి వెంటనే స్పందించి సహకరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి యర్రంశెట్టి సుబ్బారావు కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్కరించారు.

అలాగే గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు నిరంతరం సహకరిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు గ్రామస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply