Pawan Kalyan | పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని విజ్ఞప్తి

కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధించాలని సూచన
నిందితుల బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి
బాధిత చిన్నారులకు పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలి
ఫిర్యాదు అందగానే ప్రాథమిక విచారణ పేరుతో జాప్యం వద్దు
తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని రేవంత్‌ను కోరిన పవన్

Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. చిన్నారులపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించే పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన కోరారు. పోక్సో కేసుల విచారణలో జాప్యాన్ని నివారించేందుకు నిర్దిష్ట కాలపరిమితి విధించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

పోక్సో కేసుల్లో బాధిత చిన్నారులకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ కోరారు. నిందితుల బెయిల్ పిటిషన్ల విషయంలో ప్రాసిక్యూషన్ బలమైన వాదనలు వినిపించి, బెయిల్ మంజూరును తీవ్రంగా వ్యతిరేకించేలా చర్యలు ఉండాలని లేఖలో పేర్కొన్నారు.

అదేవిధంగా, పోక్సో కేసులకు సంబంధించిన ఫిర్యాదులు అందినప్పుడు ప్రాథమిక విచారణ పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదులో జాప్యం చేయకుండా, చట్ట నిబంధనలకు అనుగుణంగా తక్షణమే కేసు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని పవన్ కల్యాణ్ కోరారు.

బాధిత చిన్నారుల భద్రత, కేసుల సత్వర విచారణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, పోక్సో చట్టం అమలును మరింత సమర్థంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు.