Crime | ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు?
Crime | ఫిర్యాదు కోసం వచ్చిన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు?
మాయమాటలతో నమ్మించి నాలుగేళ్లుగా దాడి చేశాడని ఆరోపణ
సీపీ ఆదేశాలతో ఎస్సై రాజ్‌కుమార్‌పై కేసు నమోదు
Crime | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హనుమకొండ జిల్లాలో ఓ ఎస్సైపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళను మాయమాటలతో నమ్మించి, పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలు ఆరోపించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు, ఎస్సై గోదారి రాజ్‌కుమార్ తన భర్తతో ఉన్న కుటుంబ వివాదాలను పరిష్కరిస్తానని, అవసరమైతే విడాకులు ఇప్పించి తనకు అండగా ఉంటానని నమ్మించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా లైంగికంగా వేధించాడని ఆరోపించింది.
బాధితురాలు బీ.ఫార్మసీ చదువుతున్న సమయంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో 2022 మార్చిలో ఆమె తన భర్తపై హనుమకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆ సమయంలో అక్కడ ఎస్సైగా పనిచేస్తున్న రాజ్‌కుమార్ తనకు న్యాయం చేస్తానని నమ్మించి దగ్గరయ్యాడని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, తనకు పరిచయం ఉన్న న్యాయవాది ద్వారా విడాకులు ఇప్పించినట్లు తెలిపింది. ఆ తర్వాత పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయంపై బాధితురాలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. అనంతరం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
అయితే, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారులు తెలిపారు.
