అభివృద్ధి–సంక్షేమమే కూటమి బలం..

  • ఇంటింటికీ కూటమి విజయాల ప్రచారం
  • రెండేళ్ల పాలన ప్రజల ముందుకు..
  • గొల్లపూడిలో దేవినేని ఉమా ఇంటింటి ప్రచారం


(విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ ) : కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి సాయిపురం కాలనీలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనుమరాలు మునుమల్లి ఛాయాదేవిని నివాసంలో కలిసిన దేవినేని ఉమా ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాలనీలోని పలు గృహాలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో వెనుకబడిన రాష్ట్రాన్ని రెండేళ్లలోనే గాడిన పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం అందుకు నిదర్శనమని అన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమాల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త చురుకుగా పాల్గొని కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని, నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.