ఏపీ చెస్ క్వీన్‌గా శర్వాణి..

  • 7కు 7 పర్ఫెక్ట్ స్కోర్‌తో ఏపీ జూనియర్ బాలికల చెస్ టైటిల్..
  • జాతీయ పోటీలకు అర్హత
  • ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు ఘన సన్మానం..
  • రూ.5,000 నగదు బహుమతితో ప్రోత్సాహం

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి, ముస్తాబాద స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ అకాడమీకి చెందిన సీహెచ్. శర్వాణి ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది.

ఆగస్టు 1, 2 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో శర్వాణి ఏడు రౌండ్లలో ఏడు విజయాలు సాధించి 7/7 పర్ఫెక్ట్ స్కోర్‌తో టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఈ ఏడాది అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4 వరకు పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న జాతీయ జూనియర్ బాలికల చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు లభించింది.

శర్వాణి విజయాన్ని పురస్కరించుకుని మంగళవారం విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌రావు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శర్వాణి క్రమశిక్షణ, అంకితభావం, కృషి ఇతర యువ క్రీడాకారులకు ఆదర్శమని కొనియాడారు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లోనూ ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆమె ప్రతిభను గుర్తిస్తూ రూ.5,000 నగదు బహుమతిని అందజేసి జాతీయ పోటీలకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వీఆర్ బొబ్బా అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ శర్వాణి సాధించిన విజయం రాష్ట్ర చెస్‌కు గర్వకారణమని పేర్కొంటూ, జాతీయ స్థాయిలో కూడా ఇదే జోష్ కొనసాగించాలని ఆకాంక్షించారు.

శర్వాణి విజయానికి కృషి చేసిన కోచ్‌లు బండారు మహాలక్ష్మి, బండి పూజితలను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని శర్వాణికి అభినందనలు తెలియజేస్తూ జాతీయ పోటీల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.