భద్రతపై మరింత ఫోకస్..

భద్రతపై మరింత ఫోకస్..
పోలీసులకు కీలక ఆదేశాలు
కరీంనగర్ క్రైమ్ ఆంధ్రప్రభ: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలమ్ సూచించారు.
శనివారం కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో దాదాపు వెయ్యి మంది నేపాలీ కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తుండగా, ప్రస్తుతం కేవలం 169 మంది వివరాలు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.
ప్రతి వలస కార్మికుడి అధికారిక గుర్తింపు పత్రాలతో పాటు పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేయాలని సూచించారు. యజమానులు కూడా తమ వద్ద పనిచేసే కార్మికుల వివరాలను పోలీసులకు అందించాలని కోరారు.
భవిష్యత్తులో కేసుల దర్యాప్తు, ట్రాకింగ్, రికార్డుల పరిశీలన పూర్తిగా సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థ ఆధారంగానే ఉంటుందని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసు వివరాలను నిర్ణీత గడువులోగా ఎలాంటి జాప్యం లేకుండా సీసీటీఎన్‌ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక శక్తుల కదలికలపై స్థానిక పోలీసులు నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. పాత నేరస్థుల ప్రవర్తనను నిశితంగా పరిశీలిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు.
పోలీస్ స్టేషన్లలోని మార్ఖానా నిర్వహణ పారదర్శకంగా, క్రమబద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయడంతో పాటు వాటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏసీపీ సీసీఆర్‌బీ శ్రీనివాస్ జి, ఇన్‌స్పెక్టర్ సరిలాల్, కమ్యూనికేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
