ఆదివాసీ యువకులపై దాడి కేసు..

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్

ఇందనపల్లి ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్‌పై చర్యలు

జన్నారం, ఆంధ్రప్రభ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ పరిధిలోని ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఇన్‌చార్జి రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివాసీ యువకులను ఆకారణంగా కొట్టిన ఘటనకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రతిని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ విలేకరులకు చూపించారు.

మండల కేంద్రంలోని హరిత రిసార్ట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ… కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్‌డీపీఓ శాంతారాంను ఇక్కడి నుంచి బదిలీ చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఆదివాసీలపై అన్యాయం జరిగితే సహించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర నందు నాయక్, ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.