7500people |రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….

7500people | రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….
7500people | రోడ్డు భద్రత అందరి బాధ్యత
హెల్మట్, సీట్ బెల్ట్ వినియోగించాలి..
మైనర్లకు వాహనాలను ఇవ్వొద్దు..
అరైవ్ అలైవ్ లక్ష్యంగా ముందు కెళ్లాలి..
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి
7500people | కరీంనగర్, ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ: ప్రతీ ప్రాణం విలువైనదేనని, రోడ్డు భద్రతను పాటించడం ప్రతీ ఒక్కరూ బాధ్యతగా భావించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లో అరైవ్- అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైన డీజీపీ మాట్లాడుతూ వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ క్షె మంగా తమ ఇళ్లకు చేరుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టిందని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య కంటే రోడ్డు ప్రమాదాలే అతిపెద్ద సవాలుగా మారాయన్నారు. గత ఏడాది రాష్ట్రంలో హత్యల వల్ల 800 మంది ప్రాణాలు కోల్పోగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7500 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. రోడ్డు భద్రత కేవలం పోలీస్, రవాణా శాఖల బాధ్యత మాత్రమే కాదని, వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.
అందుకే మొదటిసారిగా పోలీస్ శాఖ కార్యక్రమాన్ని ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో చేర్చడం జరిగిందన్నారు. జిల్లాలో జరుగుతున్న ప్రమాదాల్లో 70శాతం మరణాలు ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయని, బైక్ నడి ఎ వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, తప్పనిసరిగా స్ట్రిప్ పెట్టుకోవాలని సూచించారు. హెల్మెట్ ధరించడం అనేది ప్యాంటుకు బెల్టు ఎట్టుకున్నంత సహజంగా అలవరచుకోవాలని కోరారు. ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే అందరూ సీట్ బెల్ట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగులు తెరుచుకుంటాయని, ప్రయాణికులు వాహనం వెలుపల పడకుండా రక్షణ లభిస్తుందని వివరించారు.
మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్ ప్రయాణించడం, ఓవర్ కాన్ఫిడెన్స్ డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడుతున్నాయని వివరించారు. వాహనదారులు ఎల్లప్పుడూ పరిసరాలను గమనిస్తూ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ చేయాలని, ముఖ్యంగా స్కూళ్లు, గ్రామాల జంక్షన్ల వద్ద వేగాన్ని తగ్గించాలని సూచించారు.
పాదాచారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారు ఎల్లప్పుడూ వాహనాలు వచ్చే ఎదురు దిశలో నడవాలని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చె శారు. లైసెన్స్ వచ్చిన తర్వాతే పిల్లలకు వాహనాలు ఇవ్వాలని, విద్యార్థులు కూడా బైకుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తేవద్దని కోరారు. అరైవ్ అలైవ్ సందేశాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్లి రోడ్డు ప్రమాద రహిత తెలంగాణను నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్ అశ్విని, డీఎంహెచ్ వెంకటరమణ, ఎంవీఐ చక్రవర్తి, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణలు పాల్గొన్నారు.
