ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తాం..

  • నిరంతర సాధనతోనే విజయాలు సాధ్యం
  • రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026, క్లస్టర్-ఏ క్రీడల్లో కాళేశ్వరం జోన్ 48 పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ గ్రౌండ్స్లో నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్- 2026, క్లస్టర్- ఏలోని 14 ఈవెంట్లు మూడు రోజుల క్రితం విజయవంతంగా ముగిశాయి.

ఈ క్రీడల్లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులను సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో పోలీస్ కమిషనర్ అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పతక విజేతలను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జట్టు సమన్వయం, పరస్పర సహకారం, నిరంతర సాధన, లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడం వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం జోన్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

పోలీస్ ఉద్యోగంలో శారీరక దారుఢ్యంతోపాటు క్రమశిక్షణ, సమన్వయం, జట్టు భావన అత్యంత కీలకమన్నారు. క్రీడలు ఈ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. నేరాల దర్యాప్తు నుంచి శాంతిభద్రతల నిర్వహణ వరకు ప్రతి బాధ్యతలో జట్టు సమన్వయం విజయానికి దోహదపడుతుందని తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రీడాస్ఫూర్తిని అలవర్చుకుని, ఒకరిపై ఒకరు విశ్వాసం పెంచుకుంటూ సమిష్టిగా పనిచేస్తే మరిన్ని విజయాలు సాధించవచ్చని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

క్రీడలకు సమయం కేటాయించే పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించి శాఖకు మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల్లో విజయం క్రమశిక్షణ, సమన్వయం, నిరంతర సాధన ఫలితమేనన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని, విధి నిర్వహణలో క్రీడాస్ఫూర్తి ఎంతో అవసరమని తెలిపారు. 14 ఈవెంట్లలో కాళేశ్వరం జోన్ నుంచి 51 మంది పాల్గొనగా, 31 మంది క్రీడాకారులు మొత్తం 48 పతకాలు సాధించారు.

8 బంగారు పతకాలు, 16 వెండి పతకాలు, 24 కాంస్య పతకాలున్నాయి. పతక విజేతల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్కు చెందిన నలుగురు, ములుగు జిల్లా నుంచి ముగ్గురు, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి తొమ్మిది మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 15 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్, జోన్ సూపరెంట్ సందీప్,ఆర్లు దామోదర్, మల్లేశం, శేఖర్, రమేష్, జయశంకర్ భూపాలపల్లి ఆర్ఐ కాసిరామ్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ ఆర్ఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.