బలోపేతం దిశగా బిఆర్ఎస్..
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్లీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? ఆ దిశగా పార్టీ చేస్తున్న కృషి ఎంతవరకు ఫలిస్తుంది? అనే చర్చలు ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోరుగా సాగుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గత నాలుగు నెలలుగా కార్యకలాపాలను వేగవంతం చేసింది. మాజీ మంత్రులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. పరామర్శలు, శుభకార్యాల్లో పాల్గొంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవల వ్యవసాయ సీజన్‌లో మొక్కజొన్న కొనుగోళ్లలో ఎదురైన సమస్యలు, మార్కెట్ యార్డుల్లో నిల్వలు పేరుకుపోవడం, గన్నీ బ్యాగుల కొరత, దళారుల దోపిడీ వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టారు. మార్కెట్ యార్డులను సందర్శించి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతో పాటు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో పార్టీ క్యాడర్‌ను మళ్లీ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసేలా చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల సందర్శన సందర్భంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఇటీవల జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా గెలవనివ్వబోమని ముఖ్యమంత్రి సవాల్ చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకత్వం స్పందించింది. మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ప్రెస్‌మీట్లు నిర్వహించి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
అయితే బీఆర్ఎస్ ప్రకటించిన ప్రాజెక్టుల బాట పాదయాత్రపై ఇప్పటికీ స్పష్టత లేదు. పాదయాత్ర నిర్వహిస్తారా లేదా అన్న అంశంపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా బీఆర్ఎస్ దృష్టి సారించింది. కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చలు చేపట్టింది. సభ్యత్వ నమోదు కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఇన్‌చార్జిలను నియమించింది. అచ్చంపేట నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

అయితే నాగర్‌కర్నూల్ జిల్లాకు ఇప్పటికీ జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం పార్టీకి ఒక లోపంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడం, కాంగ్రెస్‌కు ధీటుగా నిలిచే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం లక్ష్యంగా బీఆర్ఎస్ క్రమబద్ధమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
