ALERT | జూమ్ సమావేశంలో పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌చార్జి
ALERT | జూమ్ సమావేశంలో పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌చార్జి
హాజరైన కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు, మంత్రి పొన్నం
ALERT | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో వారు పార్టీ శ్రేణులకు పలు కీలక సూచనలు చేశారు. ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే బీఎల్ఏ-2లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు నాయకులు సమావేశంలో వివరించారు. ఇదే ఉత్సాహంతో తదుపరి కార్యక్రమాలను కూడా కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి బూత్ పరిధిలో ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతను కొత్త ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే చిరునామా మార్పు, పేరు సవరణ, ఫొటో మార్పు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
బూత్ లెవెల్ ఏజెంట్లు తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు జాబితాలను ధృవీకరించాలని, ఎన్నికల సంఘం విడుదల చేసే ప్రతి ముసాయిదా జాబితాను పరిశీలించి అవసరమైన అభ్యంతరాలు, సవరణలు సకాలంలో సమర్పించాలని సూచించారు. గ్రామ, వార్డు, మండల స్థాయిలో పార్టీ నాయకులు సమన్వయంతో పని చేస్తూ ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీ సంస్థాగత బలోపేతానికి ఎస్‌ఐఆర్ ప్రక్రియను అవకాశంగా మలుచుకుని ప్రజలతో మరింత మమేకం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
