తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
- ముఖ్యఅతిథిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ,ఎస్పీ
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించనున్న 13వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి హాజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఉదయం 8:00 గంటలకు ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

సోమవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు.
వేడుకల షెడ్యూల్ ఇలా..

ఉదయం 7:35 గంటలకు జిల్లా ఎస్పీ, 7:45 గంటలకు జిల్లా కలెక్టర్, 7:50 గంటలకు ముఖ్య అతిథి వేడుకల ప్రాంగణానికి చేరుకుంటారని తెలిపారు. అనంతరం 7:52 గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలతో నివాళులర్పిస్తారని చెప్పారు.
ఉదయం 8:00 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ, 8:05 గంటలకు పోలీసుల గౌరవ వందనంతో కవాతు నిర్వహించబడుతుందని వివరించారు. 8:15 గంటలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్య అతిథి ప్రసంగిస్తారని తెలిపారు.

అనంతరం 8:50 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 9:10 గంటలకు స్టాల్స్ సందర్శన, 9:30 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సమయాన్ని అనుకూలంగా నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కోరారు.
