రైతుల పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తోంది
రైతుల పేరుతో బీఆర్‌ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తోంది
- ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి.
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలో ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తూ ధర్నాలు నిర్వహిస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు,అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5 లక్షల 82 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు.
దీని విలువ రూ.1390 కోట్లుగా ఉండగా,ఇప్పటికే రూ.1181 కోట్లను సుమారు 62,404 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగితే,అందులో నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని,జిల్లానే రాష్ట్రంలో అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాగా నిలిచిందన్నారు.దొడ్డు రకం వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం అనుమతుల ఆలస్యంతో కొంత ఇబ్బంది ఏర్పడిందని,అయినప్పటికీ ఇప్పటికే 50 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
జిల్లాలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,వచ్చే పది రోజుల్లో జిల్లాలో ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,భూపతి రెడ్డి తదితరులు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై నగేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.మంత్రి పదవిలో ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గం తప్ప జిల్లాలో ఎక్కడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.నిజామాబాద్ బైపాస్ రోడ్డు పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు.
రైతుల పేరుతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను రోడ్లపైకి తీసుకొచ్చి రాజకీయ డ్రామాలు చేస్తున్నారని అన్నారు.అలాగే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.రాజకీయాల్లో మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడటం జీవన్ రెడ్డి రాజకీయ సంస్కృతిని బయటపెడుతోందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాలతో నడిచే పార్టీ అయినప్పటికీ, నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
మక్కల కొనుగోలు విషయంపై మాట్లాడుతూ జిల్లాలో 32 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 38,556 మెట్రిక్ టన్నుల మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. లక్ష్యానికి మించి కొనుగోలు జరిగిందని,జిల్లాలోని ప్రతి మక్క గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి భక్తవత్సలం,జిల్లా ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్,రత్నాకర్ గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్,ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్,ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్,ఏఎంసీ డైరెక్టర్ రఘు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
