Palnadu | నరసరావుపేట బస్టాండ్‌లో విషాద ఘటన..
- బస్సులోనే ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి
- పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల అసలు కారణం వెల్లడి
నరసరావుపేట (క్రైమ్), ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ నుంచి నరసరావుపేటకు వచ్చిన కర్నూలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి బస్సులోనే మృతి చెందడంతో కలకలం రేగింది.
మృతుడు బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన రెడ్డిబోయిన ఆదాము (55)గా పోలీసులు గుర్తించారు. అనారోగ్యంతో చిలకలూరిపేటలో చికిత్స పొందుతున్న తన భార్య మరియమ్మను పరామర్శించేందుకు ఆదాము వినుకొండ నుంచి బస్సులో బయలుదేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు బస్సు నరసరావుపేట బస్టాండ్‌కు చేరుకున్న అనంతరం, సీటు నంబర్ 21లో కూర్చున్న ఆదాము స్పందించకపోవడంతో బస్సు సిబ్బంది, తోటి ప్రయాణికులు పరిశీలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆదాముకు టీబీ (క్షయ) వ్యాధి ఉండడంతో పాటు గత నాలుగు రోజులుగా సరిగా భోజనం కూడా చేయలేదని తెలిసింది. అనారోగ్యంతో పాటు గుండెపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా మార్గమధ్యంలోనే మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడికానుంది.
సమాచారం అందుకున్న నరసరావుపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ సభ్యులను విచారించి, మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
