డ్రైనేజీ దుస్థితితో లంబాడీ తండా వాసుల అవస్థలు
మురుగునీటితో నిండిన కాలువలు..
వెంటనే శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ–ఎల్లాపూర్ గ్రామంలోని లంబాడీ తండాలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ కాలువలు మురుగునీటితో నిండిపోయి, శుభ్రపరిచే చర్యలు చేపట్టకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు. దీంతో తండా వాసులు అసౌకర్యానికి గురవుతున్నారని, గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
డ్రైనేజీ కాలువలను వెంటనే శుభ్రపరిచి, మురుగునీరు నిల్వ లేకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్తుడు అజ్మీర్ రాజకుమార్ డిమాండ్ చేశారు.
వర్షాకాలంలో మురుగునీటి కారణంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
