అడ్డాకుల్ కేజీబీవీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో..

అడ్డాకుల్, ఆంధ్రప్రభ : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల్ మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి పాఠశాల వంటగది, స్టోర్‌రూమ్, ప్రాంగణాన్ని పరిశీలించి పరిశుభ్రతపై ఆరా తీశారు.

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించిన డీఎంహెచ్‌వో, నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థి ఈ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

అనంతరం రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి పవని సింగ్, అధ్యాపకులు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.