తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

ప్రభుత్వ పాఠశాలలను బంగారు భవిష్యత్తుకు వేదికగా తీర్చిదిద్దుతున్నాం: బొండా ఉమా

పాయకాపురం, (ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

63వ డివిజన్ రాజీవ్‌నగర్‌లోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్‌లో సోమవారం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమామహేశ్వరరావు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి కొత్త విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా అభివృద్ధి చేస్తోందన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫారాలు, షూస్, సాక్స్, బెల్టులు, మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి సౌకర్యాలను ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాలల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్న విషయాన్ని విద్యార్థులకు గుర్తు చేస్తూ, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి మోతుకూరి ఖాసిం, అధ్యక్షుడు లబ్బ వైకుంఠం దుర్గా, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీను, టీడీపీ సెంట్రల్ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, చిగుళ్ల దుర్గాప్రసాద్, నాగమణి, సీహెచ్ రవి, తాడిశెట్టి నాగలక్ష్మి, బుదాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.