సోషల్ మీడియాపై వైసీపీ అనవసర హడావుడి..
సోషల్ మీడియాపై వైసీపీ అనవసర హడావుడి..
అసభ్యకర పోస్టులపై చట్టపరమైన చర్యలు తప్పవు..
ఇది ప్రజల ప్రభుత్వం…. చట్టానికి లోబడి ఉంటే భయం ఎందుకు
ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు..
అంబటి వ్యాఖ్యలపై ఉమా కౌంటర్.
విజయవాడ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో జరిగిన పరిణామాలను ప్రజలు మరచిపోలేదన్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, అనుచరులు ఎలా వ్యవహరించారో బోరగడ్డ అనిల్ ఘటనను పరిశీలిస్తే స్పష్టమవుతుందని బోండా ఉమా పేర్కొన్నారు. ఇప్పుడు అదే పార్టీ నేతలు సోషల్ మీడియా స్వేచ్ఛ పేరుతో మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో 70 ఏళ్ల వృద్ధురాలు ఒక వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు కూడా ఆమెపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, దూషణలు, అభ్యంతరకర పోస్టులు చేసే వారిపై మాత్రమే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యక్తులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని బోండా ఉమా స్పష్టం చేశారు. చట్టానికి లోబడి వ్యవహరించే వారి జోలికి ఎవరూ వెళ్లరని, కానీ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై మాత్రం నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, అసభ్యకర పోస్టులకు పాల్పడకుండా రాజకీయ పార్టీలు, కార్యకర్తలు వ్యవహరించాలని ఆయన సూచించారు.
