పారా స్విమ్మర్లకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు
పారా స్విమ్మర్లకు శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందనలు
విజయవాడ, ఆంధ్రప్రభ : ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెంగళూరులో నిర్వహించిన 26వ జూనియర్, సబ్ జూనియర్ నేషనల్ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పారా స్విమ్మర్లు విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో రాష్ట్ర క్రీడాకారులు 15 స్వర్ణ పతకాలు, 8 రజత పతకాలు, 6 కాంస్య పతకాలు సాధించి మొత్తం 29 పతకాలను రాష్ట్ర ఖాతాలో జమ చేశారు. ఈ విజయవంతమైన ప్రదర్శన నేపథ్యంలో పారా స్విమ్మర్లు ఈరోజు శాప్ చైర్మన్ రవి నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన రవి నాయుడు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు కీర్తి తీసుకువచ్చినందుకు ప్రశంసలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పారా క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు శాప్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని రవి నాయుడుహామీ ఇచ్చారు. అనంతరం, క్రీడాకారులు తమ విజయాలను చైర్మన్‌కు వివరించగా, ఆయన వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పారా అసోసియేషన్ సభ్యులు రామస్వామి, కోచ్ లు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
