రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆవేదన.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు

రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆవేదన.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: జిల్లాలో రైస్ మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాలు, తరుగు పేర్లతో భారీగా కోతలు విధిస్తూ తమను ఆర్థికంగా నష్టపరుస్తున్నారని ఆరోపిస్తూ రైతులు కలెక్టరేట్‌లోని ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

కల్వకుర్తి, ఊరుకొండ మండలాలకు చెందిన రైతులు వడ్లు తీసుకొచ్చి తమ సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ రావు, ఏవో చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

కల్వకుర్తిలోని పీఏసీఎస్ ద్వారా వడ్లు విక్రయించినప్పటికీ ఎలాంటి రసీదులు ఇవ్వకుండా నేరుగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. రైస్ మిల్లుల్లో తాలు, తరుగు పేరుతో అనేక కొర్రీలు పెడుతూ పెద్ద మొత్తంలో కోతలు విధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతులను నష్టపరుస్తున్నారని కూడా రైతులు ఆరోపించారు. రైస్ మిల్లర్లు చెప్పిందే అమలవుతున్న పరిస్థితి నెలకొందని, అధికారులు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు.

Leave a Reply