ఐదు రోజులుగా రోడ్డుపైనే వడ్ల లారీలు..
అచ్చంపేటలో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం!
అచ్చంపేట , ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, పుల్జలా రోడ్డులో ఉన్న లక్ష్మినరసింహ బాయిల్ రైస్ మిల్లు వద్ద వడ్ల లోడ్‌తో వచ్చిన లారీలు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొల్లాపూర్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 20 వడ్ల లారీలు గత ఐదు రోజులుగా అన్లోడ్ కాకపోవడంతో రోడ్డుపైనే బారులు తీరాయి. మిల్లు సామర్థ్యానికి మించి వడ్ల లోడ్లు రావడం, అన్లోడ్ ప్రక్రియ మందగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
పాత నిల్వలే సమస్యకు కారణం
గత ఏడాది సేకరించిన వడ్ల నిల్వలు ఇంకా మిల్లు ఆవరణలోనే పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉన్నట్లు సమాచారం. వాటిని సకాలంలో మిల్లింగ్ చేయకపోవడంతో కొత్తగా వచ్చిన వడ్ల లోడ్లను దించేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా రోజుల తరబడి రోడ్లపైనే ఉండాల్సి వస్తోందని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారిపై ప్రమాదకర పరిస్థితి
పుల్జలా–తాడూరు ప్రధాన రహదారిపై లారీలు వరుసగా నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, పాఠశాల బస్సులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. రోడ్డు ఇరుకుగా మారడంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలకు దారి లేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇటీవల సైడ్ ఇవ్వబోయిన ఒక వడ్ల లారీ బోల్తా పడగా, తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
వెంటనే చర్యలు తీసుకోవాలి
మిల్లు ముందు లారీల నిల్వ కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత సివిల్ సప్లైస్ అధికారులు మరియు స్థానిక యంత్రాంగం వెంటనే స్పందించి లారీలను త్వరితగతిన అన్లోడ్ చేయించి రహదారిని క్లియర్ చేయాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మిల్లు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

