ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం: సూర్యప్రకాశ్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఊట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సి. సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్, కొత్తపల్లి గ్రామాల్లో మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన దశల వారీగా బిల్లులు చెల్లిస్తారని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.

అర్హులైన మరింత మంది పేదలకు మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బిజ్వార్ గ్రామానికి చెందిన పోలీస్ జయమ్మ, కొత్తపల్లి గ్రామానికి చెందిన చాపలి అరుణ, నర్సమ్మలను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నారాయణ గౌడ్, ఆంజనేయులు, చెన్నకేశవులు, రాఘవేందర్ గౌడ్, అశోక్, కొత్తపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.