ఆత్మీయ విందులో కార్యకర్తలతో కలిసిన కేంద్ర మంత్రి

ఆత్మీయ విందులో కార్యకర్తలతో కలిసిన కేంద్ర మంత్రి

స్వయంగా భోజనం వడ్డించి ప్రత్యేకత చాటిన శ్రీనివాస వర్మ

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: భీమవరంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించిన ‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ రెండు రోజుల శిక్షణా తరగతులు ఆదివారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ఆత్మీయ భోజన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ విందులో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్వయంగా పాల్గొని కార్యకర్తలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఒక సాధారణ కార్యకర్తలా వ్యవహరిస్తూ శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరికీ స్వయంగా వంటకాలు వడ్డించారు. అందరికీ అన్ని రకాల వంటకాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కూర్చుని భోజనం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు సాగిన ‘పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ కేవలం శిక్షణా కార్యక్రమంగా కాకుండా, ఒక ఆత్మీయ కుటుంబ సమ్మేళనంలా సాగడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచారానికి కార్యకర్తలే మూలస్తంభాలని, వారి కృషి అమూల్యమని కొనియాడారు.

కేంద్ర మంత్రి స్వయంగా భోజనం వడ్డించడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.