నర్సాపురం ఉపకారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

ఖైదీల సంక్షేమం, ఆహారం, వైద్య సదుపాయాలపై ఆరా..

ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని సూచన

నర్సాపురం, ఆంధ్రప్రభ: ఉమ్మడి జిల్లాల ప్రధాన జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్. శ్రీదేవి శనివారం సాయంత్రం నర్సాపురం ఉపకారాగారాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఖైదీల కేసుల వివరాలు, వారికి అందుతున్న ఆహారం, మంచినీటి సౌకర్యాలు, అనారోగ్యంతో ఉన్న వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఖైదీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని అవసరమైన ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం జైలు ప్రాంగణం, పరిసరాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి వంటశాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. ఖైదీలకు అందిస్తున్న ఆహారం నాణ్యంగా, రుచికరంగా ఉండటంపై జైలు సిబ్బందిని అభినందించారు.

ఈ తనిఖీలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి, నర్సాపురం పదో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ. వాసంతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్. వరలక్ష్మి, ఉపకారాగార పర్యవేక్షణాధికారి టి. అప్పారావు, జైలు సిబ్బంది, ప్యానల్ న్యాయవాదులు జి. శివాజీ చక్రవర్తి, ఆర్. పుల్లాజి, పీఎల్‌వీ ప్రభాకరరావు పాల్గొన్నారు.