చివరి ఆయకట్టు వరకు గోదావరి జలాలే లక్ష్యం: భట్టి విక్రమార్క
ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి.
ఒక్క రూపాయి వృథా కాకుండా పూర్తి చేస్తామని హామీ
భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ: గోదావరి జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులను గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ విధానాల ద్వారా పూర్తిస్థాయిలో వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటీవల దేవాదుల ఎత్తిపోతల పథకంలోని సమ్మక్క బ్యారేజీ బ్యాక్‌వాటర్ వద్ద అన్ని పంపులను పూర్తి సామర్థ్యంతో నడిపించి 12 జిల్లాలు, 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపిన విషయాన్ని గుర్తు చేశారు.
చివరి ఆయకట్టుకు నీరే లక్ష్యం
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను చివరి ఆయకట్టు వరకు చేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాంత రైతులకు గోదావరి నీరు అందించాలనే సంకల్పంతో రాజీవ్ సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరా సాగర్ ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు.
రాజీవ్ సాగర్ ప్రాజెక్టును రూ.1,681 కోట్ల అంచనా వ్యయంతో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందించారని, గోదావరి–శబరి సంగమ ప్రాంతమైన రుద్రంకోట వద్ద రూ.1,824 కోట్లతో ఇందిరా సాగర్ ప్రాజెక్టును మరో రెండు లక్షల ఎకరాలకు నీరందించేలా ప్రణాళిక రూపొందించారని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా మొత్తం నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే అప్పటి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
పునఃరూపకల్పనతో వ్యయం పెరిగింది
రాష్ట్ర విభజనకు ముందు ఈ రెండు ప్రాజెక్టులపై సుమారు రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు జరిగిందని భట్టి పేర్కొన్నారు. మరో రూ.1,505 కోట్లతో పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ప్రాజెక్టులను పునఃరూపకల్పన చేయడంతో సీతమ్మసాగర్ బ్యారేజీని చేర్చి మొత్తం వ్యయం భారీగా పెరిగిందని విమర్శించారు. ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడిందని తెలిపారు.
లోపాలను సరిచేసి పూర్తి చేస్తాం
అయితే ఇప్పటికే ప్రజాధనం భారీగా ఖర్చు కావడంతో ప్రాజెక్టు పనులను నిలిపివేయకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టులో ఉన్న సాంకేతిక లోపాలను సరిదిద్దుతున్నామని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
రాజీవ్ కాలువను సాగర్ కాలువతో అనుసంధానం చేయడంతో పాటు వైరా, పాలేరు రిజర్వాయర్లకు లింక్ కాలువలు, సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించే పనులు చేపట్టామని తెలిపారు. సత్తుపల్లి వరకు సాగునీరు చేరేలా పనులను వేగవంతం చేస్తున్నామని, ఇందుకోసం నెలవారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
‘ఒక్క రూపాయి కూడా వృథా కాదు’
“ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల డబ్బులో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఇప్పటికే జరిగిన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూరుస్తాం” అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
గోదావరి చివరి ప్రాంతంలో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల రైతుల చిరకాల సాగునీటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
