మూడు రాష్ట్రాల గెలుపుతో..
గరిడేపల్లిలో బీజేపీ సంబురాలు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, మే 4 (ఆంధ్రప్రభ) : పశ్చిమ బెంగాల్‌తో పాటు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా సోమవారం గరిడేపల్లి మండల కేంద్రంలో బిజెపి శ్రేణులు అంబురాన్ని అంటిన సంబరాలు జరుపుకున్నారు . గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు కుక్కడపు వెంకటేశ్వర్లు గౌడ్ ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి, ప్రజలు చారిత్రాత్మక తీర్పునిస్తూ బిజెపికి పట్టం కట్టడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేస్తూ జై శ్రీరామ్, నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న సుపరిపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ విజయమే అందుకు నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా బిజెపి జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు చిత్తలూరు సోమయ్య గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నర్సింగ్ అంజయ్య గౌడ్, మండల ఉపాధ్యక్షులు నర్సింగ్ నాగ సైదులు, ప్రధాన కార్యదర్శి కామ్పాటి రాజు, పగిడి రాధాకృష్ణ, కిత రమేష్, బొమ్మ బాలకృష్ణ, గుగులోతు రాజు నాయక్, కుక్కడపు లక్ష్మయ్య గౌడ్, రాజు నాయక్, మోదాల గంగాధర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
