శాంతి భద్రతల పరిరక్షణకే పోలీస్ కవాతు..

- జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంక్రాంతి జి. పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ పోలీస్ కవాతు జరిగింది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ పోలీస్ కవాతు కార్యక్రమంలో అచ్చంపేట డీఎస్పీ సాయి వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, శంకర్, ఎస్‌ఐలు సహా భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
