Bhu Bharati | భూ భారతితోనూ.. తిప్ప‌లే !

Bhu Bharati | భూ భారతితోనూ.. తిప్ప‌లే !

Bhu Bharati | అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది సమస్యలు
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మినహా అంతా గందరగోళమే
భూమి ఉండి పాస్ బుక్కులు లేని వారు వేలమంది..
దీంతో రైతుబంధుకి దూరం
కోట్ల రూపాయలు నష్ట పోతున్న రైతాంగం
నూతన ఆర్ఓఆర్‌తో కూడా తీరని రైతాంగం వెతలు

Bhu Bharati | అశ్వారావుపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణ భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం పై అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది రైతులు పెట్టుకున్న ఆశలు ఫలించే పరిస్థితి కనపడటం లేదు. గత బీఆర్ఎస్ హయాంలో ఆరు సంవత్సరాల క్రితం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వ్యవస్థలో అధిక శాతం లోపాలే ఉండటంతో రైతాంగానికి భారీ నష్టం వాటిల్లింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ విషయమై వేలాది మంది రైతులు వివిధ రకాలైన సమస్యలపై గడిచిన ఆరు సంవత్సరాల నుంచి తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలు చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారి పోయారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లను స్థానిక త‌హ‌సీల్దార్ కార్యాలయంలోనే తహసీల్దారులు నిర్వహించటం ఒకటే రైతాంగానికి భారీగా వెసులుబాటు. ఇక‌ మిగిలినవన్నీ కూడా అనాలోచితమైన అర్థ‌రహితమైన నిర్ణయాలు కావడంతో రైతాంగానికి భారీ నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.

ప్రభుత్వ పథకాలకు దూరం
ధరణి లోపాలలో నియోజకవర్గ వ్యాప్తంగా మొట్టమొదట చర్చించాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది రైతాంగానికి నూతనంగా జారీ చేసిన పాస్‌బుక్కుల‌ విషయంలోనేనని చెప్పక తప్పదు. ఎందుకంటే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో వేలాది మంది రైతులకు భూములు ఉన్నా సరే పాస్‌బుక్‌లు లేకపోవడంతో వారు అన్ని ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు. నియోజకవర్గంలోని అధికారిక, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అశ్వరావుపేట మండలంలో 308 మంది రైతులకు, దమ్మపేట మండలంలో 423 మంది, ములకలపల్లి మండలంలో 214 మంది, చండ్రుగొండ మండలంలో 346 మంది, అన్నపురెడ్డిపల్లి మండలంలో 184 మంది రైతులకు వెరసి మొత్తం సుమారుగా 1500 మంది రైతులకు భూములు ఉండి కూడా తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పాస్ పుస్తకాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో 90 శాతం వరకు రైతులకు పాత పాస్ పుస్తకాలు ఉన్నా సరే వాటి స్థానే కొత్త పాస్ పుస్తకాలు రాకపోవడం గమనార్హం.

ఏళ్లు గ‌డ‌స్తున్నా అంద‌ని పాస్‌పుస్త‌కాలు

వీటికి గాను రెవెన్యూ అధికారులు గడిచినఆరు సంవత్సరాలుగా రైతులకు ఇవాళ రేపు అని తిప్పించడం మినహా వారు చేసేదేమీ లేకపోవటంతో రైతులు కూడా ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది. ఒక్కొక్క మండలంలో నూతన పాస్ పుస్తకాలు మంజూరు కాకపోవడానికి ఒక్కొక్క కారణాన్ని ఆయా అధికారులు చెప్పగా వీటికి ప్రధానమైన కారణం విస్తీర్ణం సమస్య అని రెవెన్యూ చట్టాల లో ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఉదాహరణకి అశ్వారావుపేట మండలంలోని 1228 సర్వే నెంబర్లో 2773 ఎకరాల విస్తీర్ణం ఉండగా 2013 వరకు ఇదే నెంబర్ లో 3230 ఎకరాలకు రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే సుమారుగా 500 ఎకరాలకు వరకు అదనంగా రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే ఈ నూతన పాస్ పుస్తకాల జారీలో సుమారు 70 నుంచి 80 మంది వరకు రైతులు అన్ని అర్హతలు ఉన్నా సరే నూతన పాస్ పుస్తకాలు రాక సంవత్సరాల తరబడి తాసిల్దార్ కార్యాలయాలు చుట్టూ ఆర్డీవో కార్యాలయం చుట్టూ జిల్లా కలెక్టర్ చుట్టూ ప్రదక్షిణలు చేయటమే వారికి సరిపోతుంది. అదేవిధంగా పట్టణంలోని 108, 104 ,911 నెంబర్లలో కూడా వాస్తవానికి శేత్వారు లో ఉన్న విస్తీర్ణం కాకుండా అధిక శాతం విస్తీర్ణానికి పాస్ పుస్తకాలు మంజూరు చేయటం వలన ఇదే పరిస్థితి ఉంది.

రైతుల‌కు రూ.కోట్లు న‌ష్టం

ఇదే సమస్య నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా ఉన్నట్లు రెవెన్యూ వర్గాల నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఆయా మండలాల్లోని విస్తీర్ణం ఎక్కువగా ఉన్న నెంబర్లలో వాస్తవానికి ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువగా విస్తీర్ణం కు పాస్ పుస్తకాలు మంజూరి అవటం తో ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది నిరుపేదలు అడ్డంగా బుక్ అయ్యారనే వాదన నెలకొంది. దీనిపై ప్రభుత్వం సమగ్ర భూసర్వే నిర్వహిస్తేనే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 1500 మంది రైతులు రైతుబంధు కి ఈ ఐదారు సంవత్సరాలు అనర్హులుగా ఉండిపోవడం వలన వారికి కోట్లాది రూపాయల నష్టం నేరుగా వాటిల్లిందని సమాచారం.

భూములను అమ్ముకోలేక ..

మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందాన గత టిఆర్ఎస్ ప్రభుత్వం 2021 సెప్టెంబర్ 2న తీసుకువచ్చిన జీవో వలన వ్యవసాయేతర భూములు ఉన్న వారికి రియల్టర్లకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. నియోజకవర్గ కేంద్రంలోనే ఈ నష్టం కోట్లలో ఉండటం విశేషం. పరిస్థితి ఎలా ఉందంటే ఒక వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమికి సంబంధించి లేఅవుట్ అప్రూవల్ ఉండి కూడా 600 గజాలు కు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే దానిని ఇద్దరికి అమ్మటానికి కూడా వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డాక్యుమెంట్ ని ఒకరికే అమ్మాలని 2021 లో వచ్చిన చట్టంలో పొందుపరిచి ఉంది. దీంతో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఎంతో కొంత లాభం వస్తుందని ఆశతో నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో కోట్లాది రూపాయలు వెచ్చించి భూములను కొనుగోలు చేసిన వారు భూములను అమ్ముకోలేక ఉంచుకోలేక గడిచిన కొంతకాలంనుండి వర్ణనాతీతమైన బాధను అనుభవిస్తున్నారు.

ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే..

కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని లోపాలను గుర్తించి వాటిని సవరణ చేసి భూ భారతి పోర్టల్ని ఏర్పాటు చేయడంతో పాటుగా నూతన ఆర్ఓఆర్ తో ఈ పోర్టల్తోనైనా తమ సమస్యలు తీరుతాయని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. భూభారతి చట్టం అమలులోకి వచ్చి అటు ఇటుగా ఏడాదికావస్తున్నా ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా రైతాంగం, రియల్టర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా మండలాల వారీగా సమస్యలను గుర్తించి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

click here to read నైరుతి .. ఆగ‌మ‌నం

click here to read more