చరణ్ కష్టానికి దక్కిన ఫలితమిదే అంటూ ట్వీట్
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్‌గా స్పందించారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా కోసం గత రెండేళ్లుగా చరణ్ పడిన కష్టం, చూపించిన శ్రద్ధను తాను దగ్గర నుంచి చూశానని తెలిపారు.
జూన్ 4న విడుదలైన ‘పెద్ది’కి తొలి రోజు నుంచే అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలోనూ చర్చ కొనసాగుతోంది.
ఈ విజయంపై స్పందించిన చిరంజీవి.. ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగానే కాకుండా ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా ఉందన్నారు. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి చరణ్ అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో కనిపిస్తున్నాయని ప్రశంసించారు. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం అని పేర్కొన్నారు.
అద్భుతమైన కథను రాసి, అంతే అందంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానకు చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత వెంకట్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
సినిమాలో కీలక పాత్రలు పోషించిన నటీనటులపైనా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. తన మిత్రుడు, కరునాడ చక్రవర్తి శివరాజ్‌కుమార్, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన జగపతిబాబుకు అభినందనలు తెలిపారు. జాన్వీ కపూర్‌తో పాటు చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
సాంకేతిక విభాగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన చిరంజీవి.. హృదయాన్ని కదిలించే నేపథ్య సంగీతం, అద్భుతమైన పాటలు అందించిన ఏ.ఆర్. రెహమాన్‌ను అభినందించారు. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా మలిచిన ఛాయాగ్రాహకుడు రత్నవేలు, తన ఎడిటింగ్‌తో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన నవీన్ నూలికి కూడా ప్రశంసలు తెలిపారు.
‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకు గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని చిరంజీవి ఆకాంక్షించారు. చరణ్‌పై తండ్రిగా గర్వం వ్యక్తం చేస్తూనే, చిత్రబృందం కృషిని గుర్తించిన మెగాస్టార్ ట్వీట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
