నాసిరకం పనులతో నేలకూలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

విద్యుత్ సరఫరా నిలిపివేతతో కాలనీవాసుల ఇబ్బందులు..

విచారణకు డిమాండ్

మక్తల్, ఆంధ్రప్రభ: విద్యుత్ పనుల్లో నాణ్యత లోపించడంతో ట్రాన్స్‌ఫార్మర్ కట్టలు కూలిపోతున్నాయని మక్తల్ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మక్తల్ పట్టణంలోని 9వ వార్డులో రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ బుధవారం రాత్రి కురిసిన వర్షానికి నేలకూలింది. ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు కట్ట కూడా కూలిపోవడంతో విద్యుత్ కనెక్షన్లు తెగిపోయాయి.

దీంతో రాఘవేంద్ర కాలనీ, శబరి కాలనీ, బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, ఎల్లమ్మకుంట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఏడాది క్రితం నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ కట్ట పటిష్టంగా ఉండగా, రెండు నెలల క్రితం నిర్మించిన కొత్త కట్ట నాసిరకం పనుల కారణంగానే కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మక్తల్ పట్టణంలో విద్యుత్ పనుల కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు అగ్రికల్చర్ డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు అందడం లేదని వాపోతున్నారు.

పట్టణంలోని బసవేశ్వర కాలనీలో నిర్మించిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ కట్ట కొద్ది రోజుల్లోనే దెబ్బతిని కూలిపోయిందని, షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.

నూతన ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ కట్టకు ఇప్పటికే పగుళ్లు వచ్చాయని, మరోసారి వర్షాలు కురిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వినాయక్ నగర్‌లోని చక్కెర హనుమప్ప గుడి వెనుక భాగంలో నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ కట్టకు కనెక్షన్ ఇవ్వకముందే పగుళ్లు ఏర్పడటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాసిరకంగా నిర్మించిన ట్రాన్స్‌ఫార్మర్ కట్టలను తొలగించి, నాణ్యమైన సామగ్రితో పునర్నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రైతుల పెండింగ్ విద్యుత్ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.

విద్యుత్ పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శివారెడ్డి, బీజేపీ నాయకులు బ్యాటరీ రాజు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.