పొగ కక్కే వాహనాలకు బ్రేక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు
- విద్యుత్ వాహనాలు, సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి
- పెట్రోల్, డీజిల్ నాణ్యతపై విస్తృత తనిఖీలు నిర్వహించాలి
- కాలం చెల్లిన వాహనాలను సీజ్ చేయండి
- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశాలు
ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక అమలుచేసి, లక్ష్యాలను అధిగమించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆదేశించారు.
గురువారం స్ధానిక కలెక్టరేటు గౌతమీ సమావేశమందిరంలో కాలుష్య నియంత్రణా మండలి, నగరపాలక సంస్ధ, రవాణా, పోలీసు, అటవీ, పరిశ్రమలు, సంబంధిత అధికారులతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్ సి ఏపి) జిల్లా స్ధాయి అమలు కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. కేంద్రప్రభుత్వం (ఎన్ సి ఏపి) 2024 -25, 2025 -26 నిధులతో చేపట్టిన పనులు, చేపట్టబోయే పనులుపై సమీక్షించి, మిగిలిన పనులు త్వరగా పూర్తిచెయ్యాలని నగరపాలక సంస్ధ, పోలీసు శాఖలు అధికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ.. ఏలూరు నగరవాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని చర్యలుతీసుకోవాలన్నారు. నగర ప్రజలకు స్వచ్చమైన గాలిని అందించేందుకు అధికారులుఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అందుకుఅనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
చెత్తకుప్పలు లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉండేలా, పొడి,తడి చెత్త వేరువేరుగా ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. మొక్కలునాటి సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. చెత్తను, వ్యర్థపదార్థాలను తగలబెట్టకుండా పక్కాచర్యలు చేపట్టాలని అన్నారు. నగరంతో పాటు రూరల్ ప్రాంతాల్లో గల ప్రైవేటు బంకులను తనిఖీచేసి పెట్రోల్, డిజిల్ నాణ్యతను పరీక్షించాలని, నాణ్యత లోపిస్తే సీజ్ చేసి, పోలీసు కేసులు పెట్టాలని అన్నారు. నగరపాలక సంస్థలో గ్రీన్ వాహనాలు ఏర్పాటు చెయ్యాలని, అదేవిధంగా బ్యాటరీ వాహనాలు, తక్కువ దూరంలో సైకిల్ మీద ప్రయాణించేలా ప్రజలకు రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.
గాలిలో దుమ్ము, ధూళి శాతాన్ని మిషన్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. కాలం చెల్లిన వాహనాలను గుర్తించి సీజ్ చెయ్యాలని, అటువంటి కేసులు పట్ల క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని, అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు కండిషన్లో, నడిపే డ్రైవర్లకు తప్పనిసరిగ్గా లైసెన్సులు కలిగి ఉండాలని వారికి క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు, వైద్యపరీక్షలు నిర్వహించాలని అన్నారు.
ఈ సమావేశంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణా మండలి ఇఇ ఏ.శ్రీరామచంద్ర మూర్తి, నగర పాలక సంస్ధ కమీషనరు ఏ.భానుప్రతాఫ్, జిల్లా పరిశ్రమలు కేంద్రం జియం ఆర్.వెంకటరావు, జిల్లా రోడ్డు ట్రాన్సుపోర్టు అధికారి యస్.బి. శేఖరు, సిపిసిబి కన్సాల్టెంటు ఏ.కోమలి, రవాణా, పోలీసు, వ్యవసాయ, కాలుష్య నియంత్ర మండలి, పౌరసరఫరాలు, అటవీ, సంబంధిత శాఖలు అధికారులు పాల్గొన్నారు.
