Bharati Fulmali | మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి ఆవేద‌న‌

Bharati Fulmali | మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి ఆవేద‌న‌

Bharati Fulmali | ఆంధ్ర‌ప్ర‌భ స్పోర్ట్స్ డెస్క్‌: తన రూపురేఖలు, వ్యక్తిత్వంపై సోషల్‌ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై భారత మహిళా క్రికెటర్ భారతి ఫుల్మాలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్‌ కామెంట్ల కంటే నెగటివ్‌ కామెంట్లే ఎక్కువగా వస్తున్నాయని, అవి మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆమె చెప్పారు. డబ్ల్యూపీఎల్‌ 2026లో గుజరాత్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్న భారతి ఫుల్మాలి, సోషల్‌ మీడియా ఆటగాళ్ల జీవితంలో తప్పనిసరి భాగమైందని అన్నారు. మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌ సెషన్లు, అభిమానుల స్పందన తెలుసుకోవాలనే ఆసక్తితో సోషల్‌ మీడియాను చూడాల్సి వస్తుందని, అయితే కామెంట్‌ సెక్షన్లలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు.

“నా లుక్స్‌, వ్యక్తిత్వం గురించి ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తే చాలా బాధగా ఉంటుంది. చాలా కామెంట్లు నెగటివ్‌గా ఉంటాయి. అది మానసికంగా ప్రభావితం చేస్తుంది” అని భారతి చెప్పినట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. క్రీడాకారిణుల ప్రతిభను ఆట ఆధారంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని, రూపురేఖలపై విమర్శలు చేయడం సరికాదనే చర్చ ఈ వ్యాఖ్యలతో మరోసారి మొదలైంది. మహిళా క్రికెటర్లు మైదానంలో తమ ప్రతిభతో నిలబడుతున్న సమయంలో ఇలాంటి వ్యక్తిగత ట్రోలింగ్‌ బాధాకరమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.