ఆలయ అభివృద్ధికి కేంద్రం ఊతం
ప్రసాద్ పథకంతో భద్రాచలం ఆలయానికి మహర్దశ
రూ.41.38 కోట్లతో భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు.. 55 శాతం పనులు పూర్తి
2026 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తి లక్ష్యం..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ (Pilgrimage Rejuvenation and Spiritual, Heritage Augmentation Drive) పథకం కింద దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పించి, మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ఆలయ పరిసరాల్లో విస్తృత స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, రూ.41.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయ్యాయి. 2026 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
భక్తులకు అత్యాధునిక సౌకర్యాలు
ప్రాజెక్టులో భాగంగా భద్రాచలంలో భక్తుల కోసం ఆధునిక పిల్గ్రిమ్ అమినిటీస్ కాంప్లెక్స్, వ్రత మండపం, కాంటీన్ భవనం, మిథిలా స్టేడియంపై షెడ్ నిర్మాణం చేపడుతున్నారు. అలాగే పర్ణశాలలో భక్తుల కోసం ప్రత్యేక వసతి గృహాలు, స్ట్రక్చర్ రూఫింగ్, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు కూడా కొనసాగుతున్నాయి. అదనంగా పార్కింగ్ సౌకర్యాలు, బాహ్య అభివృద్ధి పనులు, ఫెన్సింగ్, భక్తుల కోసం బోటింగ్ సౌకర్యం వంటి ఏర్పాట్లు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్నారు.
పర్యాటకానికి ఊతం
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు రవాణా, వసతి, ఇతర సేవలు మరింత సులభతరం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులు భద్రాచలాన్ని దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న ‘ప్రసాద్’ పథకం ద్వారా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడంతో పాటు భారత ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

