వరుస దేవాలయ చోరీలను ఛేదించిన రామడుగు పోలీసులు
అంతర్జిల్లా సీరియల్ చోరుడు అరెస్ట్.. బంగారం, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం
కరీంనగర్ క్రైం, ఆంధ్రప్రభ: రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెదిర గ్రామంలో ఇటీవల రెండు దేవాలయాల్లో జరిగిన వరుస చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో అంతర్జిల్లా సీరియల్ హౌస్ బ్రేకర్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శనివారం రూరల్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ వివరాలను వెల్లడించారు.
జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన ఎం.ఏ. అర్షద్ ఖాన్ ప్రస్తుతం కరీంనగర్ నగరంలోని సహేత్నగర్లో పీఓపీ పనులు చేస్తూ నివాసం ఉంటున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళల్లో దేవాలయాల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి, బంగారం, వెండి ఆభరణాలు, హుండీల్లోని నగదును దొంగిలించడం అలవాటుగా మార్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో జూలై 25 అర్ధరాత్రి వెదిర గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ చేసి బంగారు పుస్తెలు, వెండి వస్తువులు, హుండీ నగదును అపహరించాడు. మరుసటి రోజు రాత్రి అదే గ్రామంలోని శ్రీ మార్కండేయ స్వామి దేవాలయంలో మరోసారి చోరీకి పాల్పడి బంగారం, వెండి వస్తువులు, హుండీ నగదుతో పరారయ్యాడు.
చోరీ చేసిన సొత్తులో కొంత భాగాన్ని కరీంనగర్ టవర్ సర్కిల్లోని ఓ ఆభరణాల దుకాణంలో విక్రయించగా, మిగిలిన సొత్తును జగిత్యాలలో విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో రామడుగు పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడి వద్ద నుంచి మూడు వెండి కిరీటాలు, నాలుగు వెండి జంజీరాలు, సుమారు 1.5 గ్రాముల బంగారు పుస్తెలు, రూ.9,500 నగదు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆభరణాల దుకాణంలో విక్రయించిన ఒక వెండి కిరీటం, ఒక వెండి చంద్రవంక, ఒక జత బంగారు పుస్తెలను కూడా పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు 2025–26 సంవత్సరాల్లో చిగురుమామిడి, ఎల్ఎండీ కాలనీ, రామడుగు, చొప్పదండి, గంగాధర పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల్లోని గుర్తు తెలియని ఆభరణాల దుకాణాల్లో విక్రయించి, వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనం, మద్యపానానికి ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించగా, ఇతర ప్రాంతాల్లో విక్రయించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
కేసును సమర్థవంతంగా ఛేదించిన రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్సై రాజు, పోలీసు సిబ్బందిని అదనపు డీసీపీ వెంకటరమణ అభినందించారు.
