కోవిడ్ అనాథలకు రూ.30 లక్షల భరోసా..
- ముగ్గురు చిన్నారులకు పీఎం కేర్స్ నిధులు
- చిన్నారుల భవిష్యత్తుకు ప్రభుత్వ అండ
- రూ.10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ
- కోవిడ్ బాధిత కుటుంబాలకు చేయూత
కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులకు ప్రధానమంత్రి కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున, మొత్తం రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ శనివారం అందజేశారు.
ఈ సందర్భంగా చిన్నారులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్, వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సహాయాన్ని ఉన్నత విద్యతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్న కలెక్టర్, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల వివాహం చేసుకున్న, కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారిత శాఖ జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, లబ్ధిదారులైన చిన్నారులు, వారి సంరక్షకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి పి.విజయ తదితరులు పాల్గొన్నారు
