Healthy Foods | వాన పడుతోందా? ఈ వేడి ఆహారాలు తప్పక తీసుకోండి

Healthy Foods | వాన పడుతోందా? ఈ వేడి ఆహారాలు తప్పక తీసుకోండి

Healthy Foods | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మధ్య మధ్యలో వర్షం కాస్త విరామం తీసుకున్నా.. ఆకాశం మాత్రం మేఘావృతమై వాతావరణం చల్లగా ఉంటుంది. ఇంట్లో, బయట, ఆఫీసుల్లో ఎక్కడ చూసినా చల్లచల్లని వాతావరణమే కనిపిస్తుంది. ఇలా చల్లగా ఉన్న సమయాల్లోనే ఏ మిరపకాయ బజ్జీనో, ఉల్లిపాయ పకోడీనో తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అయినా సరే.. మనసును నిగ్రహంగా ఉంచుకుని సరైన, ఆరోగ్యకరమైన వేడి ఆహారం తీసుకుంటే అటు మనసుకు హాయి.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి. మరి అలాంటి వేడి వేడి ఆహారంపై ఓ లుక్కేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

చలికాలంలో లేదా వర్షాకాలంలో వేడి ఆహారం తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుంది. వేడి ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. సూప్‌లు, రసాలు వంటి వేడి పదార్థాలు శరీరంలో తేమను నిలుపుకోవడంలో ఉపయోగపడతాయి. జలుబు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు వేడి వంటకాలు ఉపశమనం కలిగిస్తాయి. పప్పు, కూరగాయల సూప్‌లు, హెర్బల్ టీ, ఆవిరిలో ఉడికించిన కూరగాయలు వంటి వేడి ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాలంలో వేడిగా, తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. మిరియాలు, అల్లం, వెల్లుల్లితో తయారుచేసిన టమాటో సూప్ లేదా వెజిటబుల్ సూప్ తీసుకుంటే శరీరానికి వెచ్చదనం లభించడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే వేడి హెర్బల్ టీ కూడా సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కొంతవరకు రక్షణ కల్పిస్తుంది.

అదేవిధంగా పప్పుతో చేసిన ఖిచ్డీ, పప్పన్నం, ఆవిరిలో ఉడికించిన కూరగాయలు, ఇడ్లీ వంటి తేలికపాటి ఆహారాలు జీర్ణక్రియకు అనుకూలంగా ఉంటాయి. రాగి జావ వంటి పోషకాహారం శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. వీలైనంత వరకు చల్లటి పానీయాలు, వీధి ఆహారం, ఎక్కువ నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉంటే వర్షాకాలంలో ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు.