Bapatla | ఎస్ఐ సాహస చర్య…

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని ఓడరేవు బీచ్‌లో భారీ అలల ధాటికి 17 ఏళ్ల బాలుడు సముద్రంలో కొట్టుకుపోయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈత కొడుతున్న సమయంలో అఖిలేష్ అనే బాలుడు ఒక్కసారిగా సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచేడు సబ్-ఇన్‌స్పెక్టర్ వెంటనే అప్రమత్తమై మెరైన్ పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి రప్పించారు. మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక ఈతగాళ్లు కలిసి ఉధృతంగా ఉన్న సముద్రంలోకి దూకి బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

తీవ్రమైన అలలను ఎదుర్కొంటూ బాలుడిని చేరుకున్న వారు, లైఫ్‌బాయ్ సహాయంతో అతడిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం స్పృహ కోల్పోయిన బాలుడికి బీచ్ వద్దనే తక్షణ సీపీఆర్ అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం అతడిని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ సమయోచితంగా స్పందించి బాలుడిని కాపాడిన మెరైన్ పోలీసులు, బాపట్ల జిల్లా పోలీసు బృందాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రశంసించారు.

Leave a Reply