లైన్మెన్ నిర్లక్ష్యంతో యువకుడికి విద్యుత్ షాక్..
లైన్మెన్ నిర్లక్ష్యంతో యువకుడికి విద్యుత్ షాక్..
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తుల ధర్నా
చిట్యాల, ఆంధ్రప్రభ : కరెంట్ పనుల కోసం తీసుకెళ్లిన లైన్మెన్ నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు తీవ్ర విద్యుత్ షాక్‌కు గురై గాయపడిన ఘటన చిట్యాల మండలంలో వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగి 18 రోజులు గడిచినా విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత లైన్మెన్ స్పందించకపోవడంతో బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సోమవారం చిట్యాల సబ్‌స్టేషన్ వద్ద వట్టిమర్తి గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధితుడు మనోజ్ తల్లి జాల బద్రమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిమర్తి గ్రామానికి చెందిన తన కుమారుడు మనోజ్‌ను మే 30న స్థానిక సబ్‌స్టేషన్ పరిధిలో పనిచేసే లైన్మెన్ కరెంట్ పనుల కోసం తీసుకెళ్లాడని చెప్పారు. పని సమయంలో 11 కేవీ విద్యుత్ స్తంభంపైకి మనోజ్‌ను ఎక్కించారని తెలిపారు.
అయితే అనూహ్యంగా విద్యుత్ సరఫరా కొనసాగడంతో ఇండక్షన్ ప్రభావానికి గురైన మనోజ్‌కు తీవ్ర విద్యుత్ షాక్ తగిలి, స్తంభం పై నుంచి కిందపడిపోయాడని ఆమె వివరించారు.
ఈ ప్రమాదంలో మనోజ్ రెండు కాళ్లు, చేతులు, వీపు భాగంలో తీవ్ర గాయాలకు గురయ్యాడని, పలుచోట్ల ఎముకలు విరిగిపోయాయని తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
భర్త లేని తమ కుటుంబానికి మనోజ్ ఒక్కరే ఆధారమని, ఇప్పుడు అతడే వికలాంగుడిగా మారడంతో కుటుంబం తీవ్ర కష్టాల్లో పడిందని కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాదం జరిగిన తర్వాత 17 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ లైన్మెన్ గానీ, విద్యుత్ శాఖ అధికారులు గానీ పరామర్శించలేదని, ఎలాంటి సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.
ప్రమాదానికి కారణమైన లైన్మెన్పై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ శాఖ నుంచి తమ కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని జాల బద్రమ్మ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
