సపోటా పండ్లతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు..

సపోటా పండ్లతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు..
నిపుణుల సూచనలు
ఎ. కొండూరు, ఆంధ్రప్రభ : సపోటా పండ్లు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సపోటా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటున్నారు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని తెలిపారు.
సపోటాలో అధికంగా ఫైబర్, విటమిన్ బి, యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని, కడుపు సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు వివరించారు. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో కూడా యాంటీఆక్సిడెంట్లు ఉపయోగపడతాయని చెప్పారు.
సుక్రోజ్ అధికంగా ఉండటం వల్ల సపోటా తక్షణ శక్తిని అందిస్తుందని, శారీరక శ్రమ తర్వాత అలసట తగ్గుతుందని తెలిపారు. రెగ్యులర్‌గా సపోటా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులు, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయని పేర్కొన్నారు.
సపోటాలో ఉండే విటమిన్ ఏ, బి, ఇ చర్మ ఛాయను మెరుగుపరుస్తాయని, అలాగే యాంటీఆక్సిడెంట్లు టాన్సిల్స్ వాపు, నొప్పిని తగ్గించడంలో సహకరిస్తాయని వివరించారు. సపోటాను నేరుగా తినవచ్చని లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చని సూచించారు.
కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయని నిపుణులు తెలిపారు. ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే సపోటా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
