ఆయుర్వేదంతో దుష్ప్రభావాల నుంచి రక్షణ

ఆయుర్వేదంతో దుష్ప్రభావాల నుంచి రక్షణ

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య సమస్యలలో డయాబెటిస్ ఒకటి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ వైద్య పద్ధతులు, ముఖ్యంగా ఆయుర్వేదంపై ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయుర్వేదం ద్వారా డయాబెటిస్ నియంత్రణ సాధ్యమా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ, వివిధ శాస్త్రీయ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో ఆరోగ్య పరిరక్షణపై కూడా విస్తృతంగా చర్చించారు.

మార్కెట్లో విరివిగా లభించే పదార్థాల నుంచి అరుదుగా దొరికే మూలికల వరకు వాటి ప్రయోజనాలను ఆయుర్వేదంలో వివరంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వేగంగా పెరుగుతున్న మధుమేహం నియంత్రణకు కూడా ఆయుర్వేద చికిత్సపై ఆశలు పెరుగుతున్నాయి. ఆయుర్వేదం, యోగా, ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి జీవనశైలి వ్యాధుల చికిత్సలో ఆయుష్ పద్ధతులను చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఆయుర్వేదంతో దుష్ప్రభావాలకు దూరం
ఆయుర్వేదం వల్ల భవిష్యత్తులో దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా డయాబెటిస్ నియంత్రణ కోసం రోగులు అధిక మోతాదులో మందులు తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆయుర్వేదంలో ప్రతి రోగికి వేర్వేరు విధానాలు ఉంటాయి. ఒకే విధమైన మందులు, ఆహార పద్ధతులు అందరికీ వర్తించవు. మధుమేహం తీవ్రతను బట్టి చికిత్స విధానం మారుతుంది.

ఆయుర్వేదం ప్రకారం మధుమేహ నియంత్రణలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి—ఔషధాలు, జీవనశైలి, ఆహారం. వ్యాయామం, యోగా, సమయానికి భోజనం, సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలు కీలకం. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు ఆయుర్వేద మందులు, వ్యాయామంతో తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఆయుర్వేదంలో ఎదురవుతున్న సవాళ్లు
ఆయుర్వేద వైద్యంలో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఆధునిక వైద్యశాస్త్రం ఆశించే స్థాయిలో క్లినికల్ ట్రయల్స్, శాస్త్రీయ డేటా కొరత ఉంది. అలాగే మార్కెట్లో లభించే కొన్ని ఆయుర్వేద ఉత్పత్తుల్లో నాణ్యత సమస్యలు, కల్తీ, ప్రమాణాల లోపం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

జీవనశైలిలో మార్పులతో డయాబెటిస్ నియంత్రణ
ఆయుర్వేదంలో మధుమేహ నియంత్రణకు అనేక మూలికలు ఉపయోగిస్తారు. గురుమార్, దాల్చిన చెక్క, వేప, తులసి, కాకరకాయ, ఉసిరి, మెంతులు, నల్ల మిరియాలు, అల్లం వంటి పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు, చిరుధాన్యాలు—బార్లీ, గోధుమ, పాత బియ్యం, సజ్జలు, జొన్నలు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి స్థిరమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా బార్లీ బరువు నియంత్రణకు, గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఉపయోగపడుతుంది.

యోగా, నడక, జాగింగ్, ఈత వంటి వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహానికి ఆయుర్వేద మందులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా, ఇతర సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply