పట్టణాల్లో నీటికి కటకట

పట్టణాల్లో నీటికి కటకట

  • వేసవి తీవ్రతతో అడుగంటుతున్న భూగర్భజలాలు
  • అవసరానికి సరిపడా నీటిని అందివ్వలేకపోతున్న అధికారులు
  • ఖమ్మంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా
  • సిద్దిపేటలో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి
  • నల్గొండ శివారులో అలంకారప్రాయంగా నల్లాలు
  • పడకేసిన మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు
  • అరకొర నీటితో సరిపెట్టుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలోని పట్టణాల్లోని ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. తాగునీటి వెతలతో అల్లాడుతున్నారు. నల్లాలనుంచి ఎప్పుడు నీరొస్తుందో తెలీక పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా దొరికిన నీటినే వరప్రసాదంగా భావించి సర్దుకుపోతున్నారు. పెరుగుతున్న ఎండలతో భూగర్భజలాలు అడుగంటి, బోర్లు బోరుమంటున్నాయి. అధికారులు కూడా పూర్తి స్థాయి సరఫరా చేయలేక తలలు పట్టుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుని అపార్ట్మెంట్లలో సరిపెట్టుకుంటున్నారు. ప్రజల అవసరాలు నీటి వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఇదీ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆంధ్రప్రభ ప్రతినిధుల గ్రౌండ్ రిపోర్టు.

(తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్, ఆంధ్రప్రభ): ఖమ్మంలో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ రోజు విడిచి రోజు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ, పైప్‌లైన్ లీకులు, సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో పూర్తి స్థాయిలో నీటి సరఫరా కావట్లేదు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని విలీన గ్రామ పంచాయతీలు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. మరో వైపు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనుల పేరుతో పైపులైన్లు ధ్వంసం చేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీటి సరఫరా రోజు విడిచి రోజు చేస్తున్నా… అరగంట కూడా ఇవ్వడంలేదని మహిళలు తెలిపారు. పేరుకే విలీన పంచాయతీలైనా అక్కడ తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి నీరు రహదారుల గుండా ప్రవహిస్తోంది. ఎండాకాలం ఆరంభంలోనే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.

సిద్ధిపేటలో నీటి కొనుగోలు
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో నీటి డిమాండ్ పెరగడంతో సామాన్యులు దాహంతో అల్లాడుతున్నారు. సరఫరా వ్యవస్థ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు. ఒక్కోసారి మూడు నుంచి వారం రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోతుంది.

మంత్రి ఇలాకాలో తాగునీటి కష్టాలు
నల్లగొండలో ప్రజలకు సరైన తాగునీరు అందడం లేదు. మిషన్ భగీరథ నల్లాలు ఉన్నా… చుక్క నీరు కూడా రాని పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు.

మహబూబ్‌నగర్‌కు ప్రైవేటు జలవనరులే దిక్కు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజలు ప్రైవేటు నీటి వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా దుస్థితి కొనసాగుతోంది. అవసరానికి సరిపడా నీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరీంనగర్‌లో తీవ్ర నీటి సమస్య
కరీంనగర్‌లో నీటి సమస్య తీవ్రమైంది. నగర ప్రజలు నల్లా నీటి కోసం అల్లాడుతున్నారు. భూగర్భజలం తగ్గిపోవడంతో పరిస్థితి మరింత జఠిలమవుతోంది. డ్యామ్‌లో నీరు ఉన్నప్పటికీ ప్రజలకు సరిపడా అందడం లేదు.

గుక్కెడు నీటికోసం పడరాని పాట్లు
వేసవి తాపంతో పాటు గుక్కెడు నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. పలు జిల్లాల్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ట్యాంకర్ల కోసం మహిళలు పడిగాపులు కాస్తున్నారు. పైప్‌లైన్ మరమ్మతుల జాప్యం కారణంగా ప్రజలు తంటాలు పడుతున్నారు.

Leave a Reply