Traffic | ట్రాఫిక్ నిబంధనల పై ఆటో డ్రైవర్లకు అవగాహన

Traffic | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత క్రమబద్ధంగా, సురక్షితంగా మార్చే దిశగా ట్రాఫిక్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రజలకు అవాంతరాలు లేకుండా, రహదారులపై భద్రతతో కూడిన రవాణా వాతావరణం ఏర్పడేందుకు భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆటో డ్రైవర్లతో సమావేశమై వారిని వివిధ అంశాలపై చైతన్యపరిచారు. కౌన్సెలింగ్ సందర్భంగా ఆటోలు నడిపే సమయంలో చేసే సాధారణ తప్పిదాలు, వాటి వల్ల పౌరులకు కలిగే ఇబ్బందులు, ప్రమాదాల అవకాశాలను వివరించారు.

వేగం అదుపులో లేకుండా నడపడం ప్రాణాలకు హానికారకమని, పరిస్థితులను గమనిస్తూ వాహనం నడపాలని సూచించారు. నియమాలను లెక్కచేయకుండా నడిపితే జరిమానాలు, కేసులు, వాహన పత్రాల రద్దు వంటి చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు విధిగా ధారణ చేయవలసిన దుస్తుల ప్రాముఖ్యతను వివరించారు. గుర్తింపుతో, మర్యాదతో వ్యవహరించడం ప్రయాణికుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

అనుమతించిన సంఖ్యకు మించి ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతుందని చెప్పారు. ప్రజల భద్రతను ముఖ్యంగా భావించాలని సూచించారు. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం కలిగిస్తోందని పేర్కొన్నారు. నో–పార్కింగ్ ప్రాంతాల్లో నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేటాయించిన ఆటో నిలయాల్లోనే వాహనాలు నిలపాలని కోరారు. చిత్తూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు ఆటో డ్రైవర్లు పోలీసు శాఖకు సహకరించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.