2Day Meeting Iఇకపై ప్రతి శుక్రవారం ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’
2Day Meeting I ఇకపై ప్రతి శుక్రవారం ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’
-నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు –అధికారులకు సీఎం చంద్రబాబు హెచ్చరిక – నంద్యాల జిల్లాకు రూ. 155 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు మంజూరు
2Day Meeting I నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాలనను ప్రజల ముంగిటకే తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. ఇకపై కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డే…
ప్రతి సోమవారం కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్ మాదిరిగానే, ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో ‘ఫీల్డ్ గ్రీవెన్స్ డే’ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. “సింగపూర్ తరహాలో ప్రజా దర్బార్‌లు నిర్వహించి, ప్రజల వద్దే పిటిషన్లు పరిష్కరించాలి. అర్జీలు తీసుకుని కారులో పడేసే సంస్కృతికి స్వస్తి పలకాలి. పరిష్కారం చూపని కాగితాల వల్ల ప్రయోజనం లేదు” అని అధికారులను హెచ్చరించారు. ప్రతి నెలా ఒక నియోజకవర్గాన్ని కలెక్టర్లు నాలుగుసార్లు సందర్శించాలని స్పష్టం చేశారు.
డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో ‘వాట్సాప్ గవర్నెన్స్’
పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుండి 2 రోజులకు తగ్గడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇకపై 24 గంటల్లోపే ఫైళ్లను డిస్పోజ్ చేయాలని లక్ష్యం విధించారు. ప్రస్తుతం 90% సేవలు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయని, డిసెంబర్ నాటికి 100% సేవలను మొబైల్ ద్వారానే అందించాలని ఐటీ శాఖను ఆదేశించారు. వేర్వేరు వెబ్‌సైట్లు కాకుండా అన్ని శాఖల ప్రగతిని చూపేలా ఒకే ప్లాట్‌ఫారమ్ సిద్ధం చేయాలని సూచించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. 90 రోజుల్లో అన్ని శాఖల కేపీఐలతో కూడిన డ్యాష్ బోర్డును అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.
నంద్యాలకు పారిశ్రామిక వరం..
రాయలసీమ అభివృద్ధిలో భాగంగా నంద్యాల జిల్లాకు భారీ ప్రాజెక్టును సీఎం కేటాయించారు. రూ. 155 కోట్ల పెట్టుబడితో ‘క్లీన్ రెన్యువల్ ఎనర్జీ హైబ్రిడ్ లిమిటెడ్’ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పెరగడంతో పాటు వేలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అధికారులకు కీలక ఆదేశాలు..
ఆన్‌లైన్ సేవలను పెంచడం ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పించి అవినీతిని అరికట్టాలని చంద్రబాబు సూచించారు. తుపానులు, పిడుగుల హెచ్చరికలను నేరుగా ప్రజల మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపేలా టెక్నాలజీని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని, “పాలనలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో.. మానవీయ కోణం కూడా అంతే ముఖ్యమని అధికారులు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మెరుగైన సేవలందించాలి” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

